2, ఆగస్టు 2009, ఆదివారం

సమస్యను పరిష్కరించండి ... (ఆగస్టు 2009)

'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని,
చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది.
ఈ మాసం సమస్య :

" పప్పు కొనబోవుటే పెద్ద తప్పు నేడు ! "

ఈ సమస్యను పరిష్కరించి పూరణ పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందించండి.
మంచి పద్యాలను సమీక్ష చేస్తూ, మరొక టపా మాసాంతంలో అందించబడును.
పూరణకు చివరి తేది : 25 ఆగస్టు 2009

- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)

21 కామెంట్‌లు:

  1. బియ్య మది జూడ నింగితో నెయ్య మందు
    కూర గాయలా అర పూట గూడ రావు
    ధరల గతి జూడ దడ పుట్టు ధరణి లోన
    పప్పు కొనబోవుటే పెద్ద తప్పు నేడు !

    రిప్లయితొలగించండి
  2. పప్పు, చారులు, నంజులు, పచ్చడులును
    కమ్మని పెరుగు తోడుగా ఘమ్మని చవు
    లూర అతిథికి విందు సలుపుట పాడి!
    పప్పు కొనబోవుటే పెద్ద తప్పు నేడు!

    రిప్లయితొలగించండి
  3. హరి గారు !
    అందంగా పూరించారు. అభినందనలు !
    రవి గారు !
    పద్యం బాగుంది. అన్వయమే ఇంకాస్త స్పష్టంగా ఉండాలేమో !దయచేసి మరోమారు ప్రయత్నించండి.

    రిప్లయితొలగించండి
  4. పప్పు, చారులు, నంజులు, పచ్చడులును
    కమ్మని పెరుగు తోడుగా ఘమ్మని చవు
    లూర అతిథికి విందు సలిపిరి నాడు!
    పప్పు కొనబోవుటే పెద్ద తప్పు నేడు!

    (క్షమించాలి. నేను పద్యాలు కట్టడంలో ఇంకా నేను విద్యార్థినే. కాబట్టి భావం ఇంకా స్పష్టంగా ఎలా చెప్పాలో ఊహించలేకపోతున్నాను.)

    రిప్లయితొలగించండి
  5. రవి గారు !
    ముందుగా పద్య రచనలో మీ ఆసక్తికి నా అభినందనలు ! అయితే ...
    మీ మొదటి పద్యమే వ్యాకరణరిత్యా సరిగా ఉంది. మీ మార్పు వలన 3వ పాదంలో యతిభంగం అవుతుంది.
    నేనన్నది " ధరల పెరుగుదల " ప్రస్తావన చేస్తే గాని, భావం సమన్వయం అవుతుందని. మళ్ళీ ప్రయత్నించండి.
    కాని పక్షంలో నేనే సూచిస్తాను. నా ప్రయత్నమల్లా మీరు కొంచం రాణింపు పొందాలని.

    రిప్లయితొలగించండి
  6. 'అప్పు చేసినా తినవలె పప్పు కూడు'
    అన్న సూక్తి ఈనాటికి అంత మయ్యె
    అప్పు చేసిన, మరి తీర్చ తరము గాదు
    పప్పు కొనబోవుటే పెద్ద తప్పు నేడు !

    ఆచార్య గారు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. హరి గారు !
    ఈ పద్యం కూడా బాగుంది. అయితే 3వ పాదంలో యతి తప్పింది
    " అప్పు చేసిన, మరి తీర్చ నలవి గాదు " అంటే సరిపోతుంది.
    ఈ పద్యంలో మీరు చేసిన సమన్వయంలో కొత్తదనం గుభాళించింది.
    అభినందనలు !

    రిప్లయితొలగించండి
  8. ఉన్న దంతయు నూడిచి కన్న వారు
    పెళ్ళి జేసి పప్పన్నము పెట్టి యంపు
    దురుగ! రెక్కలొచ్చెను పప్పు ధరకు! ఔర!
    పప్పు కొనబోవుటే పెద్ద తప్పు నేడు!

    (ఎంచేతనో ఇంకా సరిగ్గా భావం రూపుదిద్దుకోవట్లేదు. ఇక చేతులెత్తేశానండి.)

    రిప్లయితొలగించండి
  9. రవి గారు !
    చాలా దగ్గరికి వచ్చేసారు. చిన్న మార్పు చేస్తే చాలు !

    " ఉన్నదంతయు నూడిచి కన్నవారు
    పెళ్ళి జేసి, పప్పన్నము పెట్టుచుంద్రు !
    అది అసాధ్యమయ్యె పెరిగినట్టి ధరకు -
    పప్పు కొనబోవుటే పెద్ద తప్పు నేడు ! "

    పద్యం బాగా వచ్చింది. అన్వయం బాగా కుదిరింది.
    మీ ధార బాగుంది. అభ్యాసం చేస్తూనే ఉండండి. మీకు పద్య రచన పట్టుబడినట్టే !
    అభినందనలు ! ALL THE BEST !

    రిప్లయితొలగించండి
  10. రవి గారు !
    మీ ఇంతకు ముందు పద్యాన్ని కూడా భావ సమన్వయం కొరకు ఇలా మార్చవచ్చు.
    " పప్పు, చారులు, నంజులు, పచ్చడులను
    కమ్మదనము గోరెడి మన కర్మ మేమొ !
    కంది పప్పు మూల్య మిపుడు గగన మెక్కె -
    పప్పు కొనబోవుటే పెద్ద తప్పు నేడు ! "

    మరికొంత కృషి చేయండి. మీరు మంచి పద్యాలు వ్రాయగలరు.
    జయోస్తు !

    రిప్లయితొలగించండి
  11. అద్భుతం ఫణీంద్ర గారు! ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  12. ఒక్క చిన్న సందేహం.

    "అది అసాధ్యమయ్యె పెరిగినట్టి ధరకు"

    ఆ పాదంలో "అ" కు "న" కు యతి ఎలా కుదురుతుంది? కాస్త వివరించగలరా?

    రిప్లయితొలగించండి
  13. రవి గారు,

    పెరిగినట్టి = పెరిగిన + అట్టి

    కాబట్టి 'అ' కి, నట్టి లోని 'అ' కి సరిగానే యతి కుదిరింది.

    ఆచార్య గారు, సరిచేసినందుకు ధన్యవాదాలు. ఇవి కుడా చూడండి.

    ధరలు పెరుగుట సత్యమీ ధరణి లోన
    ఉప్పు, పప్పుకు కరువది ఉండదనుచు
    తలచి నంతనే పప్పులో తరుగు పడెను
    పప్పు కొనబోవుటే పెద్ద తప్పు నేడు !

    బ్లాకు చేసిన సరకును బయలు పరచ
    నాయ కమ్మన్య 'శేఖరు' నలవి కాదు
    పప్పు ధరలెట్లు తగ్గునీ ప్రాంత మందు?
    పప్పు కొనబోవుటే పెద్ద తప్పు నేడు !

    రిప్లయితొలగించండి
  14. హరి గారు, సంధి వచ్చినప్పుడు "యతి" నియమం అలా పాటించవచ్చు అన్నమాట. ఇంకొకసారి నియమాలు పూర్తిగా చదివి ఆకళింపు చేసుకుంటాను.

    వివరణకు ధన్యవాదాలు.మీ పద్యాలు చమత్కారంగా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  15. రవి గారు !
    " సంధి వచ్చినపుడు యతి నియమం అలా పాటించవచ్చు అన్నమాట " కాదు.
    నిజానికి అలాగే పాటించాలి. అయితే నాతోబాటు చాలామంది కూడా, సంధి తరువాతి రూపంలోని అక్షరానికి కూడ యతి వేస్తుంటాం. ఉదాహరణకు హరిగారి చివరి పద్యం రెండవ పాదంలో
    " నాయకమ్మన్య శేఖరు నలవి కాదు " లోలాగా.
    దీన్ని " అఖండ యతి " అంటారు. కొందరు పండితులు దీన్ని అంగీకరించరు.
    కాని మహాకవి కరుణశ్రీ లాంటి వారే ...
    " మానసమందెదో తళుకు మన్నది పుష్ప విలాప కావ్యమై " అని అఖండ యతి వేసారు. కాబట్టి అఖండ యతిని నేను తప్పుగా భావించను.
    మీ సందేహం పూర్తిగా నివృత్తి అయిందని భావిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  16. హరి గారు !
    రవి గారి సందేహానికి నేను అందుబాటులో లేనప్పుడు సమాధానమిచ్చినందుకు కృతజ్ఞతలు.
    ఇద్దరు సహృదయ కవుల సంభాషణకు నా బ్లాగు వేదిక అయినందుకు ఆనందంగా ఉంది.
    మీ మరో రెండు పద్యాలు కూడా బాగున్నాయి.
    మీ పద్య రచనలో మంచి ధార, చమత్కృతి ఉన్నాయి. మీరు ఇదివరకే ఏమైనా పద్య కృతులు వ్రాసారో లేదో నాకు తెలియదు. ఒక శతకంతో మీ కృషిని ప్రారంభించండి.
    విజయోస్తు !

    రిప్లయితొలగించండి
  17. ఆచార్యా,

    మీ ఆశీర్వాదానికి కృతఙ్ఞతలు. ఎప్పుడో పడవ తరగతిలో పద్యాలు వ్రాయడం నేర్చుకున్న తర్వాత, ఇప్పుడే బ్లాగులలో సమస్యలు పూరించడం. మీ సూచనను తప్పక అమలు పరచడానికి ప్రయత్నిస్తాను.

    రిప్లయితొలగించండి
  18. అయితే దానికన్నా ముందు, మీవంటి వారి సలహాలు స్వీకరిస్తూ మరికొంత సాధన చేయాల్సి ఉంది.

    రిప్లయితొలగించండి
  19. హరి గారు !
    మనదంతా " కవి కులం ".
    ముందుకు పదండి. నేను మీ వెన్నంటి ఉన్నాను.

    రిప్లయితొలగించండి
  20. కంది శంకరయ్య గారు !
    మీరు స్పందించలేదేం ?

    రిప్లయితొలగించండి
  21. క్లిష్టతయొ చమత్కారమో యిష్టవిషయ
    వర్ణనంబున్న స్పందించువాఁడ నెపుడొ;
    కంది మా యింటిపేరయ్యెఁ గనుక కంది
    పప్పు కొనుట తప్పని యెట్టు లొప్పుకొందు?

    రిప్లయితొలగించండి