11, సెప్టెంబర్ 2009, శుక్రవారం

సులువుగా పద్యం వ్రాయండి ... ( సెప్టెంబరు 2009 )

ఈ మాసం మనం మరో ఛందస్సులోకి ప్రవేశిద్దాం -
దాని పేరు :" చంపక మాల "
ఉత్పల మాలకు, దీనికి కొంచమే తేడా !
ఉత్పల మాల ట్యూన్ మీకు తెలుసు -

" తానన తాననా తనన తానన తానన తాన తాననా "

ఇక ఇప్పుడు నేర్చుకోబోయే " చంపక మాల " కు ట్యూన్ :

" తననన తాననా తనన తానన తానన తాన తాననా "
( అంటే మొదట్లో ఒక దీర్ఘాక్షరం బదులు రెండు హ్రస్వాక్షరాలు వేయాలన్న మాట. )

ప్రారంభంలో ఒక అక్షరం పెరిగింది కాబట్టి యతి స్థానం ఒక అక్షరం ముందుకు జరుగుతుంది.
ఉత్పల మాలకు యతి 10 వ అక్షరమైతే, దీనికి 11 వ అక్షరం. ప్రాస నియమం ఎలాగూ ఉంటుంది కదా !
అంతే - నాలుగు పాదాలు ఒకే విధంగా వ్రాసుకు పోవడమే !

ఉదాహరణకు నన్నయ గారి పద్య మొకటి చూద్దాం -

నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటె సూనృత
వ్రత యొక బావి మేలు; మరి బావులు నూరిటి కంటె నొక్క స
త్క్రతువది మేలు; తత్క్రతు శతంబున కంటె సుతుండు మేలు; త
త్సుత శతకంబు కంటె నొక సూనృత వాక్యము మేలు సూడగాన్ !


ఇందులో ఒక పాదాన్ని విడమరచి ట్యూన్ తో పోల్చి చూద్దాం -

తననన : నుత జల
తాననా : పూరితం
తనన : బులగు
తానన : నూతులు
తానన : నూరిటి
తాన : కంటె
తాననా : సూనృత*

( * ఇక్కడ ’ సూనృత ’ లోని చివరి అక్షరం ’ త ’ తరువాత, రెండవ పాదం మొదటి అక్షరం ’ వ్ర ’ సంయుక్తాక్షరం కాబట్టి, దాని ముందుండడం వలన ’ త ’ దీర్ఘాక్షర సమానమే అవుతుంది. ఆ విధంగా ’ తాననా ’ ట్యూన్ కి ’ సూనృత ’ సరిపోయింది. ఇలాంటివి ఇది వరకు కూడా చెప్పుకొన్నాం కదా ! )

ఇలాగే ఇదే ట్యూన్ లో మిగితా మూడు పాదాలను కూడా పోల్చి చూసుకోండి.
చంపక మాల పద్యం ట్యూన్ ని, పైన పేర్కొన్న నన్నయ గారి పద్య గమనాన్ని బాగా ఆకళించుకొని, ఆ పైన మీకు తోచిన భావాన్ని చంపక మాల పద్యంలో వ్రాసేందుకు అభ్యాసం చేయండి. పద్యాలను వ్యాఖ్యలుగా అందిస్తే తప్పొప్పులను సరిదిద్ది వివరిస్తాను. All the best !

- డా. ఆచార్య ఫణీంద్ర
( సంపాదకుడు )

4 కామెంట్‌లు:

  1. మీరిచ్చిన హోంవర్కు

    జనులకు పద్యలేఖనపు చాతురిఁ గల్గ నొనర్చు నట్టి వి
    ద్యను విసుగింతయేనియు బయల్పడనీయక నిచ్చుచుండి మో
    హన కవితామృతం బొసఁగి యందరి మెప్పును పొందఁగా ఫణీం
    ద్రుని కృషి మేలుమేలనుచుఁ దోరముగా నుతి సేతు నిప్పుడున్.

    ఇక వీటిపైన ఓ చూపు ప్రసరించండి.
    లక్ష్మి రాతిరి కొంగ కళానిధియును
    చేతిగుడ్డయు వరుసగాఁ జేరినవఁట
    త్ర్యక్షరపదము లన్ని యాద్యక్షరములఁ
    జేర్చ తెలుఁగు వారల గొప్ప చిత్రమగును.
    (ఇక్కడ చిత్రమంటే చలనచిత్రం - మూవీ)

    పడగ యున్న దొకటి పవిధారి యొకఁడు స
    వర్ణదీర్ఘసంధి వలనఁ గలియ
    నలఘుపద్యరచన కాచార్యుఁడై మించె
    తెలియఁ జెప్పఁగలవె? తెలుఁగు బిడ్డ!

    రిప్లయితొలగించండి
  2. కవి శేఖరులు కంది శంకరయ్య గారు!
    ప్రథమ పద్యమునకు వందనా లొనరింతు!
    రెండవ దెరిగితిని ప్రీతి జదివి -
    మాన్య చిత్ర మద్ది - ’ మాయా బజారు ’ గా!
    కానగ తుది నుంటి ’ నేను ’ గాదొ!

    రిప్లయితొలగించండి
  3. ఆచార్యా,
    ఇది నా చిన్ని ప్రయత్నము. తప్పులను మన్నించి సవరించ గలరు.

    కట కట రాజ శేఖరుడు కాలము చేసి ఘటించె పక్షమే
    కటికులు రాజకీయు లిట కంపొన రించిరి ఆంధ్ర దేశమున్
    బొట బొట నీరు కార్చ గను బోధము కాదొకొ వీరి వేషముల్?
    నటనలు చేయ బూనితిరి నాయక మన్యులు కుర్చి కోసమై!

    రిప్లయితొలగించండి
  4. హరి గారు !

    ట్యూన్ ని బాగా అవగాహన చేసుకొన్నారు.
    గణాలు, యతులు, ప్రాసలు చక్కగా అమరాయి.
    భావం బాగుంది. భావ ప్రకటన మరింత స్పష్టంగా, చమత్కారంగా ఉంటే, పద్యం మరింత అందంగా రూపు దిద్దుకొంటుంది.
    నాలుగవ పాదంలో ’ పూనితిరి ’ అన్నది 2nd person ( నీవు లేక మీరు ) కు ప్రయోగించాలి. పద్యంలో
    ’ నాయక మణ్యులు ’ అన్నది 3rd person కాబట్టి ’ పూనిరి ’ అని ఉండాలి.
    ’ పూనితిరి ’ ని ’ పూనిరయొ ’ అని మారిస్తే సరిపోతుంది.
    ఇదే మీరు వ్రాసిన మొదటి ’ చంపక మాల ’ అయితే, మీరు ఘన విజయం సాధించినట్టే లెక్క !

    అభినందనలు !

    రిప్లయితొలగించండి