31, జులై 2011, ఆదివారం

సరస సల్లాపము - 13










ఒకానొక కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్ పోస్టుకు ప్రకటన వెలువడినప్పుడు, కరీంనగరులో కళాశాలలో పనిచేస్తున్న మహాకవి విశ్వనాథ సత్యనారాయణ అప్లై చేసుకొన్నారు. ఇంటర్వ్యూ రోజు తెలుగు శాఖాధిపతి, అభ్యర్థి విశ్వనాథ వారికి ప్రశ్నలు సంధించడం ప్రారంభించారు.

తెలుగు శాఖాధిపతి : నీ పేరు?
విశ్వనాథ వారు : ( "నన్నే గుర్తించ లేదా? పైగా ఏక వచన ప్రయోగమా ?" అని కోపం వచ్చినా తమాయించుకొని ... ) విశ్వనాథ సత్యనారాయణ
తెలుగు శాఖాధిపతి : ఏమేం కావ్యాలు వ్రాసావు?
విశ్వనాథ వారు : ( పేరు చెప్పాక కూడా అటువంటి ప్రశ్న వేసేసరికి పట్ట లేని కోపంతో ... ) నేనేం కావ్యాలు వ్రాసానో కూడా తెలియకుండానే ఇక్కడ ’తెలుగు శాఖాధిపతి’ ఎలా అయ్యావురా? నీలాంటి వాడు ఉన్నంత కాలం ఈ విశ్వవిద్యాలయం మెట్లపై అడుగిడను. ( అంటూ కోపంగా వెళ్ళిపోయారు.)

తరువాత విశ్వనాథ వారు ఏ విశ్వవిద్యాలయంలోను ’ప్రొఫెసర్’ మెట్టెక్కలేక పోవడం ఆంధ్రుల దురదృష్టం.
ఇంత వరకు చాలా మందికి తెలిసిన కథే. చాలా ఏళ్ళ తరువాత ఈ విషయం విశ్వనాథ వారు కూడ స్వయంగా వ్రాసుకొన్నారు.

కొసమెరుపు : విశ్వనాథ వారు స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టాక, రిటైరైన ఆ తెలుగు శాఖాధిపతిని ఒక సాహిత్యాభిమాని " ఇది నిజమేనా? " అని అడిగాడు. దానికి ఆ సాహితీమూర్తి సమాధానం - " ఆయన మహాకవి అని నాకు తెలుసు. కాని ఇంటర్వ్యూలలో పరీక్షకుడు తనకు సమాధానాలు తెలిసి కూడా అభ్యర్థిని ప్రశ్నిస్తాడని ఆయనకు తెలియదు. ఆయనకు ఆ కనీస విషయం తెలియక పోతే  నేనేం చేయను? "

ఆనాటి ఆ తెలుగు శాఖాధిపతి - ఆచార్య బిరుదురాజు రామరాజు గారు.

5 కామెంట్‌లు:

  1. చంద్రశేఖర్ (lanpad@gmail.com)31 జులై, 2011 7:05 PMకి

    నాదొక విన్నపము: నేను కూడా జాబ్ ఇంటర్వ్యూలు చేస్తుంటాను అమెరికాలో కూడా. వచ్చిన అభ్యర్ధి సత్తా బట్టి ప్రశ్నలు మొదల పెట్టాలి. చక్కగా రిసీవ్ చేసుకోవాలి. బహుశ: రామరాజు గారికి ఆ విజ్ఞానం కొరవడి వుంటుంది. అందరికీ లాగేమూసకట్టు పశ్నలు వేసిన రామరాజు గారికి తన ఆధిక్యం చాటుకోవాలనే తాపత్రం (నేనుఇచ్చేవాడిని-వాడుపుచ్చుకొనేవాడు) ఎక్కువయిందనిపిస్తోంది. విశ్వనాధ మరలా ప్రొఫెసర్ గా ఎక్కడా చేరకపోవటం నాకు చాలా గర్వ కారణంగా వుంది. ఇప్పుడు-అప్పుడూ యెప్పుడూ ప్రతిభకి దర్పణం పదవులు కాదు అని చాటి చెప్పేవాళ్ళు ఎంతో మంది వున్నారు. సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల వారు ఇంకొక మచ్చుతునక.

    రిప్లయితొలగించండి
  2. చంద్రశేఖర్ గారు!
    ఇద్దరు మహా సాహితీ మూర్తుల మధ్య మాత్సర్యాలు, చమత్కార బాణాలు విసురుకోవడం మామూలే! వారి వారి ప్రతిభ, స్థాయిని బట్టి ఆ సరస సంభాషణ లాడుకొనే అర్హత వారికుంటుంది.
    ఆ సంభాషణలలోని లాజిక్కులను, మ్యాజిక్కులను విని మనం ఆనందించాలేగాని, వారిలో ఒకరి పక్షం చేరి, మరొకరిపై బాణాలను సంధించే అర్హత మనకున్నదని నేననుకోవడం లేదు.

    రిప్లయితొలగించండి
  3. చంద్రశేఖర్3 ఆగస్టు, 2011 5:20 PMకి

    డా. ఫణీంద్ర గారూ, మీ పోస్టింగు మరలా చదివాను. హాస్యోక్తి స్ఫురించలేదు సరి గదా "...తరువాత విశ్వనాథ వారు ఏ విశ్వవిద్యాలయంలోను ’ప్రొఫెసర్’ మెట్టెక్కలేక పోవడం ఆంధ్రుల దురదృష్టం" అనే వాక్యంలో మెట్టు "యెక్కలేక పోవటం" కన్నా వారి ప్రతిభా, నిజాంశం తెలిసిన వారు, మెట్టు "యెక్కలేదు" అనో, "యెక్క దలుచుకోలేదనో వుంటే బాగుండేది. బహుశ: అలా ప్రొఫెసర్ అయివుంటే మనము వారిని యెపుడో మరచిపోయేవాళ్లమేమో, అంతసాహితీ సంపద మనకు దక్కేది కాదేమో. ఏమయినా గానీ, వారు వారే, వీరు వీరే. ఇక్కడ పక్షపాతం లేదని దయచేసి మనవి చేసుకొంటున్నాను.

    రిప్లయితొలగించండి
  4. చంద్రశేఖర్ గారు!
    ’సరసం’ అంటే కేవలం హాస్యం అనుకోవడం పరిమితార్థం. రసంతో కూడుకొన్నది అనుకుంటే అది విశేషార్థం.
    వారు.. వీరు.. సమానమని ఎవరైనా అన్నారా? అనగలరా? ముఖే ముఖే సరస్వతి! ఆ దేవి ఎవరి నోట ఎప్పుడు ఎలా పలుకుతుందో ఎవరు చెప్పగలరు? అంత మాత్రాన వ్యక్తిత్వాలు బేరీజు వేయవలసిన అవసరం ఉందా?
    "ఆంధ్రుల దురదృష్టం" అని నేను ఆవేదన వ్యక్తం చేయడాన్ని ప్రక్కన బెట్టి, "ఎక్కలేక" అన్నదాన్ని నెగటివ్ గా హైలైట్ చేయడం మీకు భావ్యమా? ఎక్కలేకపోవడానికి ప్రతిభాలోపం అని నేను వ్రాసానా? అనుకూలించని పరిస్థితులు కారణం కాకూడదా?
    నేనూ ఆరాధించే కవిపై మీకు మహాభిమానం ఉండవచ్చు. కాని అది ఇతరులను అపార్థం చేసుకొనేంత దురభిమానం కాకూడదు.
    "ప్రొఫెసర్ అయివుంటే మనము వారిని యెపుడో మరచిపోయేవాళ్లమేమో, అంతసాహితీ సంపద మనకు దక్కేది కాదేమో" అన్న మాటను కూడా నేను ఏకీభవించను. ఆయన ప్రొఫెసర్ కానంత మాత్రాన ఖాళీగా ఉన్నారా? కళాశాల అధ్యాపక వృత్తిని కొనసాగిచారు కదా!
    ఆయన ఆంధ్ర సాహితీ లోకానికి అందించిన మహా రచనలు కూడా స్వయంగా ఆయన చేతితో వ్రాయలేదట. ఆయన డిక్టేట్ చేస్తుంటే జువ్వాడి గౌతమరావు వంటి వాళ్ళు వ్రాసే వాళ్ళట. అంతటి ప్రణాళిక, చాతుర్యం, బహుముఖీన ప్రతిభా సంపత్తి, అన్నిటికీ మించి సంకల్పబలం కలిగి ఉండడం వలననే, ఎవరికీ సాధ్యం కానన్ని గ్రంథాలను, అమృత తుల్యమైన స్థాయిలో అందించగలిగారు. కాబట్టి ఉద్యోగం ఆయన స్థాయిని తగ్గించేది అనడం, అందునా " ప్రొఫెసర్ అయివుంటే మనము వారిని యెపుడో మరచిపోయేవాళ్లమేమో" అనడం ఆయన విరాట్ వ్యక్తిత్వ వైభవాన్ని తక్కువ చేసి మాట్లాడడమే అనిపిస్తోంది నాకు.

    రిప్లయితొలగించండి
  5. చంద్రశేఖర్ గారు!

    నా గురువుకు తా గురువయ!
    ఆ గతి నాకగును తాత ఆ ’కవి సమ్రాట్’!
    ఈ గొడ వేమిటి మిత్రమ?
    ఏ గతి నే చీల్చి చూపుదీ హృది నతనిన్?

    రిప్లయితొలగించండి