6, ఫిబ్రవరి 2009, శుక్రవారం

సమస్యను పరిష్కరించండి

పద్యాన్ని పూరించి ఈ సమస్యను పరిష్కరించండి.
'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని, చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది. ప్రతి నెలా మేమిచ్చే ఒక 'సమస్య'ను పూరించి, పద్యాన్ని మీ 'వ్యాఖ్య' గా అందించండి.

ఈ నెల సమస్య : సైకిలుపై కారు ఎక్కి స్వారీ చేసెన్!
-------------------------------------------------

8 కామెంట్‌లు:

  1. కందము.
    ఆకృతి దాల్చగ కూటమి
    ఆకలన సమయము వచ్చినంత తెరాసా
    కైకొనెను పెక్కు సీట్లన్
    సైకిలుపై కారు ఎక్కి స్వారీ చేసెన్!!

    ఆకలన సమయము = ఎన్నికల సమయము

    రిప్లయితొలగించండి
  2. పైకము పదవుల చాలక
    రైతులేకరువులు వినకనె రోడ్డున నిలచీ
    మైకులో అరిచిరి ఓటిడ
    " సైకిలుపై ", కారు ఎక్కి స్వారీ చేసెన్!

    రిప్లయితొలగించండి
  3. సత్య నారాయణ గారూ! పద్యం భేషుగా ఉంది. అభినందనలు
    - డా.ఆచార్య ఫణీంద్ర

    రిప్లయితొలగించండి
  4. ఆత్రేయ గారూ! మంచి ప్రయత్నం చేసారు. అయితే రెండో పాదంలో ’ప్రాస’,’యతి’,కొన్ని గణాలు తప్పయి.మూడో పాదంలో "మైకులో" అనే బదులు "మైకున" అంటే సరి పోతుంది. కొంచం ప్రయత్నించి రెండు, మూడు పాదాలను సరి చేసి మళ్ళీ పోస్ట్ చేయండి. ఇలా అభ్యాసం చేస్తే మీరు మంచి పద్య కవులుగా రూపొందుతారు. గుడ్ లక్!
    - డా.ఆచార్య ఫణీంద్ర

    రిప్లయితొలగించండి
  5. తప్పును సూచించి నందుకు ధన్యవాదాలు. సరి చేసుకోవటానికి ప్రయత్నించాను.

    పైకము పదవుల చాలక
    రైతుల ఏడుపు వినకనె రాజుల నిలచీ
    మైకున అరిచిరి ఓటిడ
    " సైకిలుపై ", కారు ఎక్కి స్వారీ చేసెన్!

    రిప్లయితొలగించండి
  6. ఆత్రేయ గారు!
    ’నిలిచీ’ సాధు రూపం కాదు. ’రైతుల’ శబ్దం ప్రాస స్థానంలో వాడలేము.

    "పైకము, పదవులు చాలక
    శోకించెడి రైతుల వ్యధ చూడక రాజుల్
    మైకున అరచిరి ఓటిడ -
    సైకిలుపై కారు ఎక్కి స్వారీ చేసెన్!" అనండి.

    పద్యం బాగుంది. బలహీనమైపోయిన రైతులను ’సైకిల్’ తో, ’బలిసి’పోయిన రాజకీయ నేతలను ’కారు’తో పోల్చి మీరు చేసిన సమన్వయం ఆలోచనాత్మకంగా ఉంది. అభినందనలు!

    - డా.ఆచార్య ఫణీంద్ర

    రిప్లయితొలగించండి
  7. మీ సవరణ చాలా బాగుందండి. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. మరి కొంత మంది ప్రయత్నిస్తారేమో అని చూసాను.
    సరే! ఇక నా పూరణ ఇస్తున్నాను.

    నాకిడవలె పలు సీట్లని,
    లేకున్నను పొత్తులింక లేవని చెప్పెన్
    ఆ కే.సీ.ఆర్. బాబుకు -
    సైకిలుపై కారు ఎక్కి స్వారీ చేసెన్!

    ఈ నెలాఖరులోపు పద్య కవులెవరైనా మరికొన్ని మంచి పూరణలను అందించవచ్చు.
    - డా.ఆచార్య ఫణీంద్ర

    రిప్లయితొలగించండి