9, ఫిబ్రవరి 2009, సోమవారం

ఈ మాసం పద్య కవిత

teluguthalli2

తెలుగు వెలుగు
- డా.ఆచార్య ఫణీంద్ర

భాష ఎయ్యది దేవభాషతో పెనగూడి
జంట నాగుల నాట్య జతులు పలికె-
భాష దేనిని యతిప్రాసలే ఒనగూడి
కవచ కుండల దివ్య కాంతులొలికె-
భాష ఎద్దానికిన్ ద్వ్యర్థి మరియు త్ర్యర్థి
సత్కావ్య నిర్మాణ సత్త్వ మమరె-
కరము నే భాషరా కర్ణాట సంగీత
వాగ్గేయ కళకయ్యె పట్టుగొమ్మ-

భాష దేనిలో అవధాన భాసుర కళ
విశ్వ భాషీయులకు నెల్ల విస్తు గొలిపె-
అద్ది నాదు తెలుగు భాష! అమృత ధార!
తెలుగు గాక ఇంకెందునీ వెలుగు గలదు?

ఒక విదేశీయుడే ఉప్పొంగి స్తుతియించె
ఇది ’ఇటాలియ నాఫ్ ద ఈస్ట’టంచు -
ఒక విదేశీయుడే ఊడిగమ్మును చేసె
జీవితాంతము, దీని ఠీవి మెచ్చి -
ఒక విదేశమునందు నుత్సవా లగుచుండె
’ఆట’,’తానా’లకై ఆట పట్టు -
ఒక దేశమని కాదు - సకలావనిని నేడు
తెలుగు భాషా జ్యోతి తేజరిల్లె -

’దేశ భాషలందు తెలుగు లెస్స’ యనుట
ప్రాత వడిన మాట - శ్రోతలార!
దేశ భాషలును, విదేశ భాషలు నెల్ల
విశ్వ భాషలందు వెలుగు తెలుగు!


* ఈ శీర్షికలో ప్రచురణార్థం పద్య కవులు తమ పద్య కవితలను తెలుగు(యూనికోడ్)లో టైపు చేసి, dr.acharya_phaneendra@in.com కు ఈ-మెయిల్ చేయగలరు.

- డా.ఆచార్య ఫణీంద్ర ( సంపాదకుడు )

3 కామెంట్‌లు:

  1. బాగుందండి. "విశ్వ భాషలందు వెలుగు తెలుగు" ఎల్లప్పుడూ సిద్దించాలని కోరుకుంటూ..

    రిప్లయితొలగించండి
  2. సత్య నారాయణ గారికి ధన్యవాదాలు.
    నిజానికి ఈ శీర్శిక ఇతర పద్య కవుల పద్యాల ప్రచురణార్థం ఏర్పాటు చేయబడింది. బ్లాగు ప్రారంభ సంచిక కాబట్టి, నా పద్యాలతో, అదీ - తెలుగు భాషా ప్రస్తుతితో ప్రారంభించాను. దయ చేసి మీకు తెలిసిన పద్య కవులందరికీ ఈ విషయం తెలియజేసి, పద్య కవితలను నా ఈ-మెయిల్ కు పంపించమని చెప్పగలరు.
    - డా.ఆచార్య ఫణీంద్ర ( సంపాదకులు )

    రిప్లయితొలగించండి
  3. డా.ఆచార్య ఫణీంద్ర గారు,
    నేను ఇప్పుడిప్పుడే పద్యాలు వ్రాయడము నేర్చుకుంటున్నాను. "పద్యము" వ్రాసే స్థితికి చేరుకున్నాను కాని "పద్య కవిత్వం" వ్రాసే స్థాయికి ఇంకా చేరుకోలేదు.

    కాని మన బ్లాగ్లోకములో చాలా మంది పద్య కవులున్నారు. ఈ టపా (మరియు వ్యాక్యలు) కూడలి మరియు జల్లెడలలో కనపడుతున్నవి కాబట్టి మన బ్లాగు పద్య కవులు మీ పిలుపుకు ప్రతిస్పందిస్తారని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి