26, ఫిబ్రవరి 2009, గురువారం

పద్య కవులారా! "తొ" కాదు - "తో"

పద్య కవులారా! "తొ" కాదు - "తో"
-------------------------------------
డా.ఆచార్య ఫణీంద్ర

ఇటీవల అంతర్జాలంలో చాల మంది పద్య కవులు "కరుణతొ", "సీతతొ" అని పద్యాలలో వ్రాస్తున్నారు. అది తప్పు. "కరుణతో", "సీతతో" అని వ్రాయాలి. "తొ" అన్నది సాధు రూపం కాదు. తృతీయ విభక్తిలో - "చేతన్, చేన్, తోడన్, తోన్" అన్న రూపాలే ఉన్నాయి కాని, "తొన్" లేదు కదా! (వచనంలో కూడా ఇలా వ్రాయడం తప్పే అవుతుంది సుమా!) ఇలాంటిదే - షష్ఠీ విభక్తిలోని "లోన్" కూడా. "గదిలొ" అని వ్రాయకూడదు. "గదిలో" అని వ్రాయాలి.


అయితే ఈ విషయంలో గణాల కోసం ఇబ్బంది పడే పద్య కవులకు ఒక చిన్న సలహా!

ఒకవేళ "కరుణతొ బ్రోచె" అని వ్రాయాలి అనుకొందాం. అప్పుడు "కరుణను బ్రోచె" అని వ్రాయవచ్చు.
అలాగే "సీతతొ చెప్పె" అని వ్రాయాలనుకోండి. అప్పుడు "సీతకు చెప్పె" అని వ్రాయవచ్చు.
అదే విధంగా "గదిలొ" అని వ్రాయాలి అనుకొందాం. అప్పుడు "గదిని" అని వ్రాయవచ్చు.
ఇలాంటి మెలకువలు పాటించి పద్య కవులు తప్పులు లేకుండా పద్య రచన చేస్తారని ఆశిద్దాం.

" పద్యం రక్షతి రక్షితమ్ "

3 కామెంట్‌లు:

  1. మన దైనందిన కార్యక్రమాల్లో మనం సాధారణంగా మాట్లాడే పదాల్లో రాతలో చాలా తప్పులుంటున్నాయి.తెలిసో తెలియకో తప్పులు చేస్తుంటాము.ఆచార్యులవారూ దయచేసి అలాంటి పదాల్లో తప్పు ఒప్పులు తెలియచేస్తే అందరికీ ముఖ్యంగా తెలుగు భాషకు మేలు చేసినవారవుతారు. మా విన్నపాన్ని మన్నించి అప్పుడప్పుడు మీ టపాల్లో తెలియచేయగలరు.

    రిప్లయితొలగించండి
  2. గణాల కోసం వచ్చిన ఇబ్బంది వల్లే ఇది. మీ సూచనలు బావున్నాయి. అయితే ఇవి చాలవండి. ఇంకా చాలా కా(రా)వాలి మీ దగ్గర నుండి.

    రిప్లయితొలగించండి
  3. విజయ మోహన్ గారికి, రవి గారికి ధన్యవాదాలు.
    తెలుగు భాష విషయంలోగాని, పద్య కవిత్వం విషయంలోగాని నా దృష్టికి వచ్చే ఇలాంటి దోషాల గురించి తప్పకుండా ఈ బ్లాగు ద్వారా వివరించగలను. పాఠకులు సైతం తమకు గల సందేహాలను నా ఈ టపాకు వ్యాఖ్యల ద్వారా తెలియపరిస్తే వాటికి వివరణలందించే ప్రయత్నం చేయగలను. మా గురువు గారు కీ.శే.నండూరి రామకృష్ణమాచార్య ఆశీస్సులతో తెలుగు భాషాభివృద్దికి , పద్య కవిత్వ వ్యాప్తికి నా వంతు కృషిని ప్రతి నెలా ఈ బ్లాగు ద్వారా చేయాలని సదాశయం. ఆ పైన భగవంతుని కృప!
    మీ అభిమానానికి మరొకమారు ధన్యవాదాలు.
    - డా.ఆచార్య ఫణీంద్ర

    రిప్లయితొలగించండి