16, జూన్ 2009, మంగళవారం

సులువుగా పద్యం వ్రాయండి ... (జూన్ 2009)

యతి , ప్రాసల సాధనకు ఒక నెల సమయమిచ్చి , నేనే మరో నెల పనుల ఒత్తిళ్ళ వల్ల మీకు కనిపించకుండాపోయాను. అయితే అది మీకు మరింత అధ్యయనానికి , అభ్యాసానికి ఉపకరించిందని భావిస్తున్నాను. ఇక ఈ మాసం పద్య రచనకు ఉపక్రమిద్దాం. అదీ .. ఏకంగా వృత్త పద్యమయిన " ఉత్పల మాల ". మరి మీరు సిద్ధమేనా ?
మీలో చాలా మంది ఎప్పుడో ఒకప్పుడు సినిమా పాటలు వ్రాయాలని కలలు కని ఉంటారు. అప్పుడప్పుడు పాత తెలుగు పాటలకు " పేరడీ " గీతా లల్లి ఉంటారు. లేదా హిందీ పాటలకు తెలుగు అనువాద గీతాలు రచించి ఉంటారు. ఇలా ఏదో ఒక " ట్యూన్ " కి పాట వ్రాయడం సులువైన పనే. అదిగో .. అలాగే " ఉత్పల మాల " పద్యం వ్రాయడం కూడా నేర్చుకొందాం.
" ఉత్పల మాలలో మొత్తం 4 పాదాలు ( అంటే , 4 లైన్లు ) ఉంటాయి. ప్రతి పాదంలోనూ ఒకే రకమైన " ట్యూన్ " ఉంటుంది. ఆ " ట్యూన్ " కి పాట వ్రాసినట్లు పదాలు కూర్చుతూ పోవడమే. ప్రతి పాదంలో మొదటి అక్షరానికి , మళ్ళీ
10 వ అక్షరానికి యతి కుదుర్చాలి. అలాగే ఇంతకు ముందు చెప్పుకొన్నట్లుగా , ప్రతి పాదంలో 2 వ అక్షరాన్ని ప్రాసగా ఒకే హల్లుకు చెందిన అక్షరాన్ని ఉపయోగించాలి.
ఇంతకీ ఆ ట్యూన్ ... ఏంటంటే ..............
" తానన తాననా తనన తానన తానన తాన తాననా "
ఇక్కడ ట్యూన్ లో .. " తానన " అన్న చోట _
" పాటలు " ...
" పద్యము " ...
" అందుకు " ... ఇలా ఏ పదమైనా వేసుకోవచ్చు.
అలాగే " తాననా " అన్న చోట _
" నీ వలెన్ " ...
" చేయగా " ...
" ఇందులో " ...
" పద్ధతుల్ " ... ఇలా ఏమైనా అర్థవంతంగా పదాలు పూరించుకోవచ్చు.
ఇంకా " తనన " అన్న చోట _
" రచన " ...
" నిలయ " ...
" మదిని " ... ఇలా వేసుకోవచ్చు.
ఇప్పుడు మొత్తం పాదానికి ఒక ఉదాహరణ చూడండి _
" పద్యము వ్రాయుటెం తొసుల భమ్మని చెప్పుట కిద్ది సాక్ష్యమౌ " ( ఇక్కడ 1 వ అక్షరమైన " ప " కి , 10 వ అక్షరమైన " భ " కి యతి కుదిరింది.
ఇప్పుడొక ప్రసిద్ధ పద్యాన్ని ఉదాహరణగా చూద్దాం .....
" కాటుక కంటినీ రుచను కట్టుప యింబడ నేల యేడ్చెదో
కైటభ దైత్యమ ర్దనుని గాదిలి కోడల ఓమ దంబయో
హాటక గర్భురా ణినిను నాకటి కింగొని పోయి యల్లక
ర్ణాటకి రాటకీ చకుల కమ్మత్రి శుద్ధిగ నమ్ము భారతీ "
ఇక్కడ పదాలను విడగొట్టి " ట్యూన్ " ప్రకారం చూపిన సంగతి గ్రహించగలరు. అలాగే ప్రతి పాదంలో యతి , ప్రాసలను కూడా గమనించండి.
ఈ పద్ధతి ప్రకారం మీకు తోచిన భావాన్ని పద్యంగా వ్రాసేందుకు అభ్యాసం చేయండి. పూర్తయిన పద్యాన్ని వ్యాఖ్యగా పోస్ట్ చేస్తే , తప్పొప్పులు వివరిస్తాను. ఇంకా ఎందుకు ఆలస్యం ? ప్రారంభించండి.
_ డా || ఆచార్య ఫణీంద్ర
( సంపాదకుడు )

6 కామెంట్‌లు:

  1. నాకూ హాజరు వేయండి. త్వరలో పద్యం వ్రాయాలని నా లక్ష్యం. అది మీ పాఠాలతో సఫలం కానుంది. కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  2. మార్తి లక్ష్మీ నారాయణ శాస్త్రి17 జూన్, 2009 10:00 AMకి

    చిన్నప్పడు ఎంత కష్టపడి నేర్చుకున్నా వంటబట్టని/అవగాహన కాని ఛందస్సులను ఇంత సులువుగా అరటిపండు పండు ఒలిచినట్టు వివరించినందుకు చాలా కృతజ్ఞుడను. ఇన్నాళ్ళుగా మింగుడు పడని ఛందస్సుగూర్చి ఇప్పటికైనా కొంచెం అర్థం గావటం చాలా సంతోషంగా ఉంది.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. " తానన తాననా తనన తానన తానన తాన తాననా "

    బావుంది. ఏదైనా గీతం కానీ, ఓ త్యాగయ్య లేదా అన్నమయ్య పదం కానీ ఈ ట్యూన్ లో దొరుకుతుందా? (అలాగైతే బాగా గుర్తుండిపోతుంది అని అడుగుతున్నాను).

    రిప్లయితొలగించండి
  4. ఉష గారు !
    మీ భావుకతకు ఛందస్సు తోడైతే , కమ్మని పద్యాలు ఫలిస్తాయి. తప్పక ప్రయత్నించండి.
    _ డా || ఆచార్య ఫణీంద్ర

    రిప్లయితొలగించండి
  5. శాస్త్రి గారు !
    గురు లఘువులు , యమాతారాజభానస , గణ విభజనల గోల లేకుండా పద్య రచన నేర్పాలన్న నా ప్రయత్నం సత్ఫలితమిస్తున్న దనడానికి తొలి నిదర్శనం మీ వ్యాఖ్య. చాలా సంతోషంగా ఉంది. మీకు నా ధన్యవాదాలు !
    _ డా || ఆచార్య ఫణీంద్ర

    రిప్లయితొలగించండి
  6. రవి గారు !
    త్యాగయ్య గానీ, అన్నమయ్య గానీ ఈ ట్యూన్ లో వ్రాస్తే అది కూడా "ఉత్పల మాలే" అవుతుంది కానీ _ కీర్తననో పదమో కాదు. వాగ్గేయకారుడు భక్త రామదాసు అన్ని కీర్తనలు వ్రాసినా , " దాశరథి శతకం " లో ఉత్పల మాలలు , చంపక మాలలు వ్రాసి తన పద్య కవిత్వ దాహాన్ని తీర్చుకొన్నాడు.
    " శ్రీరఘు రామ ! చారు తులసీ దళ ధామ ! శమక్షమాది శృం
    గార గుణాభి రామ ................. " వంటి అందులోని ప్రసిద్ధ పద్యాలు ఉత్పల మాలలే !
    _ డా || ఆచార్య ఫణీంద్ర

    రిప్లయితొలగించండి