3, మార్చి 2009, మంగళవారం

సమస్యను పరిష్కరించండి (మార్చి 2009)

'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని, చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది. ఈ మాసం సమస్య :
" పది రూపాయలు సన్న బియ్యమన కంపం బెత్తి రాంధ్ర ప్రజల్ ! "
ఈ సమస్యను పరిష్కరించి పూరణ పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందించండి.
మంచి పద్యాలను సమీక్ష చేస్తూ, మరొక టపా మాసాంతంలో అందించబడును.
పూరణకు చివరి తేది : 25 మార్చి 2009

- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)

10 కామెంట్‌లు:

  1. ఫణీంద్ర గారు - ఒకసారి kuppalas [at] gmail [dot] com కి మెయిలు చెయ్యగలరా?

    రిప్లయితొలగించండి
  2. పది రూపాయల నోటుతో నిపుడు ఏపూటైన నిండేన కు
    క్షి ది గ్రేట్ సీయము రాజశేఖరుడు సాక్షాత్తూ ప్రజాబద్దుడై
    ఇదిగో ఇచ్చెను రెండు రూకల కిలో బియ్యం సరేపోయె ము
    ప్పది రూపాయలు సన్న బియ్యమన కంపం బెత్తి రాంధ్రా ప్రజల్

    రిప్లయితొలగించండి
  3. హరి గారు! అభినందనలు!
    సమస్య ఇచ్చి పది రోజులు దాటినా, ఇంకా ఒక్క పూరణ కూడా రాలేదే - అనుకొంటున్న వేళ, మీరు చక్కని పద్యాన్ని అందించారు. ఒక దశలో సమస్య మరీ జటిలంగా ఇచ్చానా - అన్న ఆలోచనలో పడ్డాను. కాని మీరు అంతర్జాలంలోని పద్య కవుల సామర్థ్యాన్ని శంకించవలసిన పని లేదని నిరూపించారు. సమస్యను భావౌచిత్యంతో అద్భుతంగా పరిష్కరించారు. ’పది రూపాయల’ను, ’ముప్పది రూపాయలు’ గా మలచి, నేనూహించిన ఫలితాన్నే రాబట్టారు. మీకు మరొకమారు నా అభినందనలను తెలియజేస్తున్నాను.
    అయితే యతి నియమంలో మీరు - ’స్వర (అచ్చు) మైత్రి’ , ’వ్యంజన (హల్లు) మైత్రి - ఈ రెంటిలో ఏదో ఒకటే పాటించారు. రెండూ తప్పకుండా పాటించాలి. అందుకే చిన్న మార్పులతో సరిచేస్తున్నాను. గమనించండి.

    "పది రూపాయల నోటుతో నిపుడు ఏ పాటైన నిండేన కు
    క్షి? ది గ్రేట్ సీ.యము.రాజశేఖరుని సాక్షిన్, కొద్ది బియ్యంబునే
    ఇదిగో యంచిడె రెండు రూప్యములకే - ఏ మూల కౌనద్ది? ము
    ప్పది రూపాయలు సన్న బియ్యమన కంపంబెత్తి రాంధ్ర ప్రజల్!"

    ’ఏ పూటైన’ ను ’ఏ పాటైన’ గా మార్చాను. అంటే ’ఏ మాత్రమైనా ’ అని అర్థం.

    - డా.ఆచార్య ఫణీంద్ర

    రిప్లయితొలగించండి
  4. డా.ఆచార్య ఫణీంద్ర గారికి ధన్యవాదాలు.

    పద్యాన్ని సరి దిద్దినందుకు మరోసారి ధన్యవాదాలు. స్వర మైత్రి, వ్యంజన మైత్రి గురించి తెలియదు. సరి చేసుకుంటాను.

    రిప్లయితొలగించండి
  5. హరి గారు!

    మీరు ఈ బ్లాగులోని "సులువుగా పద్యం వ్రాయండి" టపాను చూస్తున్నారా?
    ఏప్రిల్ నెలలో ’స్వర మైత్రి’, ’వ్యంజన మైత్రి’ ల గురించి వివరిస్తాను. తప్పక చదవండి.

    - డా|| ఆచార్య ఫణీంద్ర

    రిప్లయితొలగించండి
  6. ఆచార్య ఫణీంద్రు లిచట
    బ్రోచారట ఆంధ్ర జనుల, బ్లాగుల తోడన్
    లేచారు నడుము గట్టీ
    ప్రాచుర్యము చేయ తెలుగు పద్యావళినిన్

    ఇప్పటివరకు చూడ లేదు. ఇక నుండి తప్పక చదువుతాను.

    రిప్లయితొలగించండి
  7. సమస్య - పది రూపాయలు సన్నబియ్యమన కంపం బెత్తి రాంధ్రప్రజల్.
    శా|| పదవిం బొందఁగ రాజశేఖరుఁ డహో వాగ్దానముం జేసినాఁ
    డిదె వీక్షింపుఁడు ముఖ్యమంత్రి నయి నే నిట్టే ధరల్ దగ్గఁ జే
    సెద నంచుం గడు నమ్మఁ బల్కి పదవిం జేపట్టినన్ నేడు ము
    ప్పది రూపాయలు సన్నబియ్య మన కంపం బెత్తి రాంధ్రప్రజల్.

    రిప్లయితొలగించండి
  8. కవి వరేణ్యులు శ్రీ కంది శంకరయ్య గారికి నమః

    ఆలస్యంగా అందించినా, అతి మనోహరమయిన పద్యాన్ని అందించారు. ఇరవయ్యైదవ తేది లోపు అందించి ఉంటే ’సంపాదకీయం’(ప్రత్యేకమయిన టపా)లో సమీక్షిస్తూ ప్రముఖంగా ప్రచురించి ఉండేవాడిని. ఏమైనా మీకు నా అభినందన పూర్వక ధన్యవాదాలు.

    - డా.ఆచార్య ఫణీంద్ర

    రిప్లయితొలగించండి
  9. శ్రీ ఆచార్య ఫణీంద్ర గారికి నమస్కారం.
    నా పూరణ మీకు నచ్చినందుకు ధన్యుణ్ణి. నేను మీ బ్లాగును ఆలస్యంగా చూసాను. అది కూడా మలక్ పేట్ రౌడీ బ్లాగులో లింకు దొరకడం వల్ల. కొత్తగా పద్యాలు రాయాలనుకొనే ఔత్సాహికులకు మీరిస్తున్న సలహాలు, పాఠాలు బాగుంటున్నాయి. నెలాఖరులో కొత్త సమస్య ఇస్తామన్నారు. ఇంకా ఇవ్వలేదు. వెంటనే ఇవ్వండి.

    రిప్లయితొలగించండి
  10. శంకరయ్య గారు-

    మీకు ఆసక్తి ఉంటే, ఇక్కడొక సమస్య ఉంది చూడండి.
    "పచ్చనైన చెట్టు పద్యమయ్యె!"

    http://www.padyam.net/content/view/20/1/

    రిప్లయితొలగించండి