11, మార్చి 2009, బుధవారం

సులువుగా పద్యం వ్రాయండి ... (మార్చి 2009)

ఛందస్సు , గణాలు , 'యమాతారాజభానస' ల గోల లేకుండా పాట వ్రాసినంత సులువుగా పద్యం వ్రాయడం నేర్పుతానని గత నెలలో చెప్పడం జరిగింది. అయితే అంతకు ముందు 'యతి' , 'ప్రాస' ల గురించి కాస్త తెలుసుకోవలసిన అవసరం ఉంది.
తెలుగు భాషకు ఎంతో అందాన్ని కొనితెచ్చిన అమూల్య వరాలు యతిప్రాసలు. తెలుగు భాషకు అవి సహజ కవచ కుండలాల వంటివని మా గురువు గారు కీ. శే. నండూరి రామకృష్ణమాచార్య చమత్కరించే వారు. ఈ యతి ప్రాసలు కేవలం పద్యాలలోనే ఉంటాయనుకొంటే పొరపాటే. మన భాషలో అడుగడుగునా కనిపిస్తూనే ఉంటాయి. ఉదాహరణకు ఊళ్లలో నిరక్షరాస్యులు చెప్పుకొనే సామెతల్లో అవి విరవిగా కనిపిస్తాయి.
"కడుపు చించుకొంటే కాళ్ళ మీద పడుతుంది." - ఇందులో ప్రారంభాక్షరం 'క' ఉంటే, కొంత విరామం తరువాత 'కాళ్ళ' అనే పదంలో 'కా' అన్న అక్షరం ఉంది. అంటే ఇక్కడ 'క'కి, 'కా'కి యతి కుదిరిందన్న మాట. దీనినే 'యతి మైత్రి' అంటారు.
"ధిల్లీకి రాజైనా -
తల్లికి కొడుకే." - ఇందులో మొదటి లైన్లో (పద్యంలో దీనినే పాదం అంటారు) రెండో అక్షరం 'ల్ల' ఉంటే రెండో పాదంలో కూడా అదే 'ల్ల' అక్షరం ఉంది. దీనినే 'ప్రాస' అంటారు. 90 శాతం పద్యాల్లో ఈ ప్రాస నియమం ఉంటుంది. కొన్ని రకాల పద్యాల్లో ఈ నియమం అవసరం లేదు. అంటే అవి వ్రాయడం మరింత సులువన్న మాట.
'' కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు" అన్న అన్నమాచార్య కీర్తనలో 'కొం'కి , 'కోనేటి' లోని 'కో'కి యతి మైత్రిని గమనించారా?
"ఇందరికీ అభయమ్ము నిచ్చు చేయి -
కందువగు మంచి బంగారు చేయి !" అన్న అన్నమయ్య కృతిలో పై పాదంలో రెండో అక్షరం (సున్నాతో కూడుకొన్న) 'ద' రెండో పాదంలోనూ అదే ఉంది. ఇదే ప్రాస. అలాగే మొదటి పాదంలో 'ఇం'కి , 'ఇచ్చు'లోని 'ఇ'కి యతి మైత్రి. రెండో పాదంలో 'కం'కి 'బంగారు'లోని 'గా'కి యతి మైత్రి'.
ఇది గమనించకుండా మనలో చాలా మంది "పద్యాల్లో యతి ప్రాసలు - అవి చాలా కష్ట"మంటూ భయపెడుతూ ఉంటారు. ఆ భయం పోవాలంటే భాషలో పలు చోట్ల వచ్చే యతి ప్రాసలను అవి భాషకు తెచ్చే అందాలను గమనించండి.
ఈ నెలంతా ఈ దృష్టితో ఒక కంట భాషను గమనిస్తూ, మీ పనులు మీరు చేసుకొంటూ పొండి. మీరు రోజూ మాటాడే భాషలోనే యతిప్రాసలను చేరుస్తూ భాషకు చేకూరే సొగసును గమనించండి. వచ్చే నెలలో పద్యాల్లో యతి ప్రాసలను ఎలా వేయాలన్న విషయాలను తెలుసుకొని ఆపైన పద్య రచనకు ఉపక్రమిద్దాం.
- డా. ఆచార్య ఫణీంద్ర ( సంపాదకుడు)

6 కామెంట్‌లు:

  1. "ఆ భయం పోవాలంటే భాషలో పలు చోట్ల వచ్చే యతి ప్రాసలను అవి భాషకు తెచ్చే అందాలను గమనించండి."

    చాలా చక్కగా చెప్పారు. ఈ భయం వల్లే వృత్తాలు, కందం జోలికి వెళ్ళాలంటే వణుకు పుడుతూంది. ఈ వివరణకు సంబంధించిన మీ తదుపరి టపాకై ఎదురుచూస్తాను.

    రిప్లయితొలగించండి
  2. రవి గారు!
    ఈ బ్లాగును, ప్రత్యేకించి ఈ శీర్షికను ఫాలో అవుతున్నందుకు సంతోషం.
    వృత్తాలను కూడా సులువుగా వ్రాసే పద్ధతులను కూడ త్వరలో వివరిస్తాను. మీ ఉత్సాహాన్ని, ఆసక్తిని అభినందిస్తున్నాను.
    - డా.ఆచార్య ఫణీంద్ర

    రిప్లయితొలగించండి
  3. ఆచార్యగారు,

    నన్నుకూడా మీ క్లాసులో చేర్చుకోండి...

    రిప్లయితొలగించండి
  4. జ్యోతి గారు!
    తప్పకుండా... మీకు సాదరాహ్వానం.
    - డా.ఆచార్య ఫణీంద్ర

    రిప్లయితొలగించండి
  5. నన్ను కూడా మీ శిష్యవర్గం లో చేర్చుకోండి గురువుగారూ.ఎంతో కాలం నుంచి మంచి గురువుగారి అన్వేషణలే ఉన్న నాకు మీ ఈ బ్లాగు మార్గదర్శకం కాగలదని భావిస్తున్నాను.గురుభ్యోన్నమః

    రిప్లయితొలగించండి
  6. నరసింహ గారు! మీ కిదే నా సాదరాహ్వానం!
    ఈ బ్లాగులోని విషయాలు మీకు ఉపకరిస్తే - అంత కన్నా నాకేం కావాలి? ఇవి గాక, ఇంకా ...
    మీరు ఎప్పుడైనా, మీకు కలిగే ఏ సందేహమైనా ఈ బ్లాగు ద్వారా అడిగి తెలుసుకోవచ్చు.
    లేదా నా ఈ అడ్రసుకు మెయిల్ చేయవచ్చు.
    ""dr.acharya_phaneendra@in.com"
    - డా.ఆచార్య ఫణీంద్ర

    రిప్లయితొలగించండి