31, మార్చి 2009, మంగళవారం

పద్య కవిత్వం - కొన్ని సందేహాలు (డా. ఆచార్య ఫణీంద్ర తో 'haaram.com' భాస్కర రామిరెడ్డి ముఖాముఖి) - మూడవ భాగం

భా.రా.:సంస్కృత పదాలను సులభంగా ఎలా గుర్తించాలి? సంధిచేసేటప్పుడు ప్రతిసారి నాకు ప్రశ్న వుత్పన్నమౌతుంది.
..:సంస్కృత పదాలను, తెలుగు పదాలను కలిపి మిశ్రమ సమాసాలు చేయడం తప్పు. పండితులు వీటిని 'దుష్ట సమాసాలు' అంటారు. వార్తా పత్రికలలో భాషా ప్రమాణాలు మరీ దిగజారి ఈ మధ్య ఇవి బాగా వ్యాపించి భాషను ఖూనీ చేస్తున్నాయి. ఉదాహరణకు ఈ మధ్య ఏ వార్తా పత్రికను చూసినా 'పాలాభిషేకం' అని వ్రాస్తున్నారు. ఇక్కడ 'పాలు'- తెలుగు పదం; 'అభిషేకం'- సంస్కృత పదం. వీటిని సమాసం చేయకూడదు. దీనిని 'క్షీరాభిషేకం' అనాలి. దురదృష్ట మేమిటంటే ఇప్పుడు పొద్దున్న లేచి చూస్తే, ప్రసిద్ధి చెందిన వార్తా పత్రికలలోనే ఇలాంటి దోషాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. అయితే వ్యవహార భాషలో ఎలా 'ఏడ్చినా', పద్యాలలో వీటిని పండితులు అంగీకరించరు. మరి ఈ తప్పులు చేయకుండా ఉండాలంటే ఏది సంస్కృత శబ్దం, ఏది తెలుగు శబ్దం అన్న పరిజ్ఞానం ఉండాలి.
ఒక చిన్న బండ గుర్తు ఉంది. మన అక్షరాలలో 'అల్ప ప్రాణాలు', 'మహా ప్రాణాలు' అని ఉన్నాయి. 'క, గ, చ, జ, త, ప, బ, మ, య, ల...' మొ||వి అల్ప ప్రాణాలు. ' ఖ, ఘ, ఛ, ఝ, థ, ధ, ఫ, భ...' మొ||వి మహాప్రాణాలు. అన్ని అల్ప ప్రాణాలున్న పదాలు 'తెలుగు పదాలు' అని చెప్పలేం గానీ - పదంలో ఒక్క మహాప్రాణమున్నా అది సంస్కృత పదమని కచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే తెలుగులో మహాప్రాణ అక్షరాలు లేవు. అవి సంసృతం నుండి గ్రహించినవే. 'బడి, గుడి, బండ, మల్లె, పువ్వు, తీగ ... ఇలా అన్నీ తెలుగు పదాలు. అంత మాత్రాన 'లత, దేవాలయం, కాలం, జగతి...' కూడా తెలుగు పదాలు కావు. ఎందుకంటే సంస్కృతంలో కూడా అల్పప్రాణ అక్షరాలు ఉంటాయి. కానీ, 'ధర్మం, ఫలం, మోక్షం, భయం...' ఇలా మహాప్రాణం ఒక్కటున్నా అది కచ్చితంగా సంస్కృత శబ్దమే! అయితే ఈ అయోమయమేమీ లేకుండా ఉండాలంటే ' శబ్ద రత్నాకరం' లేదా 'సూర్య రాయాంధ్ర నిఘంటువు' - ఈ రెండు నిఘంటువులలో ఏది చూచినా, ప్రతి పదం పక్కన అది సంస్కృత పదమా, లేక తెలుగు పదమా వ్రాసి ఉంటుంది. సమాసం చేసేప్పుడు ఏదైనా సందేహం వస్తే వాటిలో చూసుకోవచ్చు.
భా.రా.:నానార్థాల,వ్యుత్పత్తి అర్థాల కొరకు మంచి నిఘంటువులేమైనా వుంటే తెలియ జేయండి.
..: తెలుగులో ఇటీవల నానార్థాలపై ఒక చక్కని గ్రంథం వచ్చింది. డా. పి. నరసింహా రెడ్డి రచించిన 'తెలుగు నానార్థ పద నిఘంటువు' అది. ప్రగతి పబ్లిషర్స్, హైదరాబాదు వారి ప్రచురణ. అలాగే పర్యాయ పదాలపై జి. ఎన్. రెడ్డి గారి 'తెలుగు పర్యాయ పద నిఘంటువు' కూడా ఒక మంచి గ్రంథం. ఇక తెలుగు పదాలకు వ్యుత్పత్తి అర్థాలు ఉండవనే చెప్పాలి. 'చెంబు, గుడి, బండ...' మొ||న పదాలకు ఏం వ్యుత్పత్తి అర్థాలు ఉంటాయి. సంస్కృత పదాలకే వ్యుత్పత్తి అర్థాలు చెప్పవచ్చు. వీటి గురించి తెలుసుకోవాలంటే శ్రీ చలమచర్ల వేంకట శేషాచార్యులు రచించిన 'అమర కోశం- సంస్కృతాంధ్ర వివరణము' అన్న గ్రంథం చాలా అమూల్యమైనది.
భా.రా.: ఆచార్య ఫణీంద్ర గారు! సహృదయంతో శ్రమకోర్చి మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి ఓర్పుతో నా ప్రశ్నలకు సమాధానం చెప్పారు. సదా కృతఙ్ఞుడను.
..: రామిరెడ్డి గారు! మీ వల్ల బ్లాగు మిత్రులకు తెలుగు భాష గురించి, తెలుగు పద్యాల గురించి నాలుగు మంచి మాటలు చెప్పే అవకాశం లభించింది. నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలి.
(పరిసమాప్తం)

2 కామెంట్‌లు: