భా.రా.: గణాలు చూసుకుంటూ పద్యం రాస్తారా లేక పద్యం వ్రాసే టప్పుడు వచ్చే పదాల గణాలను చూసుకొని పద్యం మారుస్తారా?
ఆ.ఫ.:"కవి యన్న వాడు ఆర్తితో అరిస్తే అది ఏదో ఒక ఛందస్సులో ఉంటుంది" అన్నారు ఆరుద్ర . ఇంతకు ముందు ప్రశ్నకు చెప్పిన సమాధానంలో అన్నట్టు 'ఉత్పల మాల', చంపక మాల', 'కందం', 'సీసం' మొదలైన ఛందస్సులలో పూర్తి సాధికారత పొందేలా అభ్యాసం చేసిన వారికి - తొలి భావం ఏ ఛందస్సులో పలుకుతుందో, అదే ఛందస్సులోనే మిగితా భావం కూడా సునాయాసంగా సాగిపోతుంది. అప్పుడు ఆ కవి దృష్టి - గణాలు, ఛందస్సుపై ఉండదు. సముచితమైన పదాలను వాడుతున్నానా? లేక ఇంకా మెరుగైన పదాలను వాడగలనా? అనుకొన్న భావాన్ని పలికించ గలుగుతున్నానా? లేక ఇంక మెరుగైన భావ వ్యక్తీకరణ సాధ్యమా? - అని ఆలోచిస్తాడు. తాను ఇదివరకే చేసిన అభ్యాస ఫలితంగా ఎలాంటి దోషాలు లేకుండా గణాలు పరిగెత్తుతుంటాయి. తన అభివ్యక్తిలో పరిపక్వత కోసం కవి పద్యాన్ని పునస్సమీక్షించుకొంటూ పద్యంలో అవసరమనుకొన్న చోట్ల మార్పులు చేస్తూ పరిపూర్ణంగా సంతృప్తి కలిగే వరకు దానిని చెక్కుతూనే ఉంటాడు.
భా.రా.: యతి చాలా రకాలుగదా ? సులభంగా గుర్తుంచుకొనే మార్గాలు ఏమైనా వున్నాయా?
ఆ.ఫ.: నిజమే! యతులలో చాలా రకాలున్నాయి. అందులో 'ప్రాస యతి' వృత్తాలలో, 'కందం'లో చెల్లుబాటు కాదు. కాని 'సీసం'లో, 'ఆట వెలది', 'తేట గీతి' మొదలైన పద్యాలలో అది చాల అందాన్ని సమకూరుస్తుంది. 'ప్రాస యతి' అంటే 'యతి' బదులు ప్రక్క అక్షరంతో ప్రాస వేయడం. ఉదాహరణకు - "ఇల్లు మొత్త మతడు గుల్ల చేసె". ఇందులో 'ఇ'కి, 'గు'కి యతి కుదర లేదు. వాటి ప్రక్క అక్షరాలకు ప్రాస(ఇల్లు - గుల్ల) పడింది.
'అఖండ యతి' అని ఉంది. దీనిని 'అప్ప కవి' వంటి లాక్షణికులు అంగీకరించ లేదు. కానీ ప్రాచీన కవులలోనే కొంత మంది ఆయన మాటను పెడ చెవిన పెట్టి దీనిని ప్రయోగించారు. సరే - ఇవన్నీ కవికి వెసులుబాటు కల్పించేందుకు ఉన్నవే కాని, కవి తప్పకుండా తెలుసుకొని ప్రయోగించాలన్న నియమమేమీ లేదు. వీటి కన్నా కవి డైరెక్టుగా 'యతి మైత్రి' వేస్తేనే పండితులు హర్షిస్తారు. కాబట్టి కవి 'యతి' వేయ వలసిన స్థానంలో 'స్వర(అచ్చు) మైత్రి, వ్యంజన(హల్లు) మైత్రి కుదిరిందా చూసుకొంటే సరిపోతుంది. (సశేషం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి