సంపాదకీయం (మార్చి 2009)
- డా.ఆచార్య ఫణీంద్ర
గత నెల ప్రారంభించిన ఈ మా ’పీఠం’ అధికార (బ్లాగు) సంచిక విశేషాదరణను పొందిందనే చెప్పాలి. ఫిబ్రవరిలో వాగ్దానం చేసిన మేరకు, ఈ నెల ’సులువుగా పద్యం వ్రాయండి’ శీర్షిక ద్వారా పద్య రచనను బోధించే పాఠాలను ధారావాహకంగా ప్రారంభించాను. అంతర్జాలంలో చాలా మంది పద్య కవులు చేస్తున్న తప్పులను తెలియజెప్పే ఒక టపాను కూడా అందించాను. భావిలో ఇలాంటి టపాలను అడపా దడపా అందిస్తూ పద్య కవితాభివృద్ధికి నా వంతు ’ఉడుత’ సాయం చేయదలిచాను.ఇవి గాక ’హారం.కాం’ భాస్కర రామిరెడ్డి గారు "ఇలాంటి బ్లాగు కోసం చాలా రోజుల నుండి వెదుకుతున్నా" నంటూ, పద్య రచన గురించి అడిగిన కొన్ని సందేహాలకు సమాధానాలను ’ముఖాముఖి’ గా అందిస్తున్నాను.
గత మాసంలాగే ఈ మాసం కూడా మా గురువు గారు దివంగత మహాకవి డా. నండూరి రామకృష్ణమాచార్యచే విరచితమైన ఒక మంచి పద్యాన్ని ’ఆణిముత్యం’ శీర్షిక ద్వారా అందించాను. అయితే వచ్చే నెల నుండి దీనిని వ్యాఖ్యాన సహితంగా అందించే ప్రయత్నం చేస్తాను.అప్పుడు పాఠకులకు ఆ పద్యాల వైశిష్ట్యం సుబోధకమవుతుంది.
’ఈ మాసం పద్య కవిత’ శీర్షికలో ప్రచురణార్థం పాఠకులు తమ పద్య కవితలను dr.acharya_phaneendra@in.com కు మెయిల్ చేయమని మరొకమారు విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇక ఈ నెల ’సమస్యను పరిష్కరించండి’కి ఒక్క పూరణ మాత్రమే వచ్చింది. బహుశః పాఠకులు సమస్య కాస్త క్లిష్టంగా ఉందని భావించారేమో! అయితే అందరిలా కాక, నేను సమకాలీన, నవీన విషయాలకు సంబంధించిన సమస్యలనే ఈయ దలిచాను. దీని వలన పద్యంలో ఆధునిక భావాలను వెల్లడించడంలో పాఠకులకు అభ్యాసం అయి, పద్యాన్ని సార్వ కాలీన ప్రక్రియగా నిలబెట్టే మహదాశయానికి దోహదం చేసిన వారమవుతాం.
"పది రూపాయలు సన్న బియ్యమన కంపంబెత్తి రాంధ్ర ప్రజల్" అన్న సమస్యకు శ్రీ ’హరి దోర్ణల’ గారి పూరణ ప్రశంసనీయంగా ఉంది. హరి గారి పూరణ ఇది -
"పది రూపాయల నోటుతో నిపుడు ఏ పాటైన నిండేన కు
క్షి? ది గ్రేట్ సీ.యము.రాజశేఖరుని సాక్షిన్, కొద్ది బియ్యంబునే
ఇదిగో యంచిడె రెండు రూప్యములకే - ఏ మూల కౌనద్ది? ము
ప్పది రూపాయలు సన్న బియ్యమన కంపంబెత్తి రాంధ్ర ప్రజల్!"
సమస్యను రూపొందించిన సంపాదకునిగా, నా పూరణ ఇలా ఉంది -
"ఎదియో కొందరికంట బియ్య మిక రెండేరెండు రూపాయలే -
అదియున్, మొత్తము నిత్తు రిర్వది కిలో లంతే! మరా పైన - ఏ
బది కొట్టుల్ వెదుకాడిన, న్నొక కిలో బాజారులో చూడ - ము
ప్పది రూపాయలు సన్న బియ్యమన కంపం బెత్తి రాంధ్ర ప్రజల్!"
ఈ బ్లాగుకు నేను సంపాదకుడను మాత్రమే. ఇందులో నా రచనల కన్న, ఎక్కువగా పాఠకుల రచనలను ప్రచురించడానికే ప్రాధాన్యతనిస్తాను. కాబట్టి పాఠకులు - ముఖ్యంగా పద్య కవులు, పద్య ప్రియులు అత్యధికంగా ఈ బ్లాగులోని వివిధ శీర్షికలలో బహుళంగా పాలు పంచుకొని పద్య కవితాభివృద్ధికి తోడ్పడాలని వేడుకొంటున్నాను.
పాఠకులందరికీ ’విరోధి’ నామ సంవత్సర ’ఉగాది’ శుభ కామనలు
- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి